ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 5 (జనవాణి): ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన 2013 జీరమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో జగదల్‌పూర్ ప్రత్యేక NIA కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ తీర్పు వెలువరించారు. దోషులకు విధించే శిక్ష వివరాలను సెప్టెంబర్ 16న ప్రకటించనున్నారు.
29 మంది మృతి
2013 మే 25న బస్తర్ జిల్లా దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరమ్ లోయ వద్ద ఈ ఘోర దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘పరివర్తన్ ర్యాలీ’ ముగించుకుని నాయకులు, కార్యకర్తలు కాన్వాయ్‌లో తిరిగి వెళ్తుండగా మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నాటి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, మాజీ ప్రతిపక్ష నేత మహేంద్రకర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్‌తో పాటు భద్రతా సిబ్బంది, పౌరులు ఉన్నారు. ఈ దాడితో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా దెబ్బతింది.
NIAకి కేసు అప్పగింత
తొలుత బస్తర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. 2014 సెప్టెంబర్‌లో NIA జగదల్‌పూర్ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం రెండు జుడీషియల్ కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు.
తీర్పుపై రాజకీయ దుమారం
కోర్టు తీర్పు నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, NIA దర్యాప్తులో పలు వాస్తవాలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. నాటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు సున్నితమైన ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. జీరమ్ వ్యాలీ దాడికి 13 ఏళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుతో కేసులో కీలక దశ ముగిసినప్పటికీ, దోషులకు ఎలాంటి శిక్ష విధిస్తారన్నది సెప్టెంబర్ 16న తేలనుంది.




















