రంగారెడ్డి, అక్టోబర్ 5 జనవాణి): రాష్ట్రంలో ఇటీవల అవినీతి అధికారులు పదుల సంఖ్యలో ఏసీబీకి పట్టుబడుతున్నా అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లంచం వ్యవహారం కలకలం రేపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదన్న కారణంతో మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తంలో భాగంగా తొలుత రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిఘా ఏర్పాటు చేశారు. బాధితుడు ఇచ్చిన రూ.లక్షను హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ నగదును డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు అందజేసినట్లు తేలింది. నగదును కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.
డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం డిమాండ్ వెనుక ఉన్న వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.



















