శబరిమలలో 445 గ్రాముల బంగారు కిరీటం మాయం!

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మరో బంగారం గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. 2012లో భక్తులు సమర్పించిన 445 గ్రాముల బంగారు కిరీటం స్ట్రాంగ్‌రూమ్ నుంచి మాయమైనట్లు తేలింది. దాని స్థానంలో అదే డిజైన్‌తో ఉన్న 240 గ్రాముల నకిలీ కిరీటం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో వెలుగులోకి వచ్చిన బంగారం అవకతవకలపై జరుగుతున్న తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.

24 సెప్టెంబర్, 2026 3:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

శబరిమలలో 445 గ్రాముల బంగారు కిరీటం మాయం!

Social Media Image

శబరిమల, సెప్టెంబర్ 24 (జనవాణి): కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మరో బంగారం గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. 2012లో భక్తులు కానుకగా సమర్పించిన 55.72 సవర్ల బంగారు కిరీటం ఆలయ స్ట్రాంగ్‌రూమ్ నుంచి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తిరువాభరణాల తనిఖీల్లో భాగంగా సన్నిధానం స్ట్రాంగ్‌రూమ్‌లో ఆడిట్ నిర్వహించగా ఈ వ్యవహారం బయటపడింది. అసలు కిరీటం స్థానంలో అదే పరిమాణం, డిజైన్‌తో ఉన్న నకిలీ కిరీటాన్ని ఉంచినట్లు తేలింది.

అధికారిక రికార్డుల ప్రకారం 2012లో తమిళనాడుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ల బృందం ఈ కిరీటాన్ని స్వామివారికి సమర్పించింది. దీని బరువు 445.78 గ్రాములు, అంటే 55.72 సవర్లు. అయితే ప్రస్తుతం స్ట్రాంగ్‌రూమ్‌లో లభించిన కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే. అసలు కిరీటం కంటే ఇది దాదాపు 206 గ్రాములు తక్కువగా ఉంది. నకిలీ కిరీటంలో వజ్రాలను పోలిన రాళ్లను అమర్చినట్లు అధికారులు గుర్తించారు.

శబరిమల ఆలయంలో విలువైన కానుకలను నిబంధనల ప్రకారం రికార్డుల్లో నమోదు చేసి సన్నిధానం స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచాలి. అనంతరం వాటిని ఆరన్ముల (Aranmula) లోని దేవస్వం బోర్డు ప్రధాన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాల్సి ఉంటుంది. అయితే 2012లో సమర్పించిన ఈ బంగారు కిరీటాన్ని ఆరన్ముల (Aranmula) స్ట్రాంగ్‌రూమ్‌కు ఎందుకు తరలించలేదనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. కిరీటం స్థానంలో నకిలీ కిరీటం ఎలా వచ్చింది? అసలు బంగారు కిరీటం ఎక్కడికి వెళ్లింది? అనే ప్రశ్నలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

శబరిమల ఆలయంలో బంగారు పూత, స్వర్ణ తాపడం రేకులకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ నేతృత్వంలో చేపట్టిన తనిఖీల్లో ఈ కొత్త వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు