Kerala : శబరిమలలో సినిమా షూటింగ్లపై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కమర్షియల్ సినిమాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మోహన్లాల్ హీరోగా నటిస్తున్న ‘అతిమనోహరం’ చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది.
మోహన్లాల్ మూవీకి అనుమతి నిరాకరణ
తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ ఓ మైథలాజికల్ థ్రిల్లర్. కథలో భాగంగా శబరిమల సన్నిధానం, పంబ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇందుకోసం అటవీ అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దీంతో చిత్రబృందం కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

అటవీ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు
పిటిషన్పై మంగళవారం విచారణ జరగగా, శబరిమల సన్నిధానం, పంబ పరిసరాల్లో సినిమా షూటింగ్లకు అనుమతి లేదని పెరియార్ టైగర్ రిజర్వ్ అధికారులు కోర్టుకు తెలిపారు. శబరిమల భక్తుల అవసరాల కోసమే అటవీ భూములను దేవస్థానం బోర్డుకు లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వన్యప్రాణి అభయారణ్యాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్లలో కమర్షియల్ సినిమా షూటింగ్లు నిర్వహించరాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అధికారులు వెల్లడించారు. వారి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అటవీ శాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఆలయ పవిత్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
ఈ వ్యవహారంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే. మురళీధర్ కూడా స్పందించారు. శబరిమల వంటి పవిత్ర ప్రాంతాల్లో కమర్షియల్ సినిమా షూటింగ్లు నిర్వహించడం వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగడంతో పాటు ప్రకృతి వనరులు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కారణాలతోనే మోహన్లాల్ సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
క్రిస్మస్కి ‘అతిమనోహరం’
‘అతిమనోహరం’ సినిమాలో మోహన్లాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘తుడరుమ్’ తర్వాత తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.




















