శబరిమల,అక్టోబర్ 1 (జనవాణి): శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీలో హలాల్ సర్టిఫికేషన్ గుర్తు ఉన్న బెల్లం వినియోగంపై కేరళ హైకోర్టు కీలక సూచనలు చేసింది. ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాలు నాణ్యతా ప్రమాణాలతో పాటు ఆలయ సంప్రదాయాలు, మతపరమైన ఆచారాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ఆదేశించింది.
హలాల్ బెల్లంపై భక్తుడి పిటిషన్
2021లో ఓ అయ్యప్ప భక్తుడు ఈ అంశంపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. శబరిమల ప్రసాదం తయారీలో ఉపయోగించే బెల్లం ప్యాకెట్లపై ‘హలాల్’ సర్టిఫికేషన్ గుర్తు ఉందని, ఇది ఆలయ మతపరమైన ఆచారాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ సంచుల్లో నాణ్యత లేని బెల్లాన్ని సరఫరా చేశారంటూ ఆరోపించారు. ప్రసాదం తయారీలో సాత్వికమైన, స్వచ్ఛమైన, నాణ్యమైన పదార్థాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
పాడైన బెల్లాన్ని ఏం చేశారు?
ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా దేవస్వం బోర్డు కోర్టుకు వివరణ ఇచ్చింది. కొవిడ్-19 కారణంగా 2019-20లో శబరిమలలో పరిమిత సంఖ్యలో ప్రసాదం అవసరమైందని, దీంతో కొంత బెల్లం సన్నిధానంలో మిగిలిపోయిందని తెలిపింది. 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నిర్వహించిన పరీక్షల్లో ఆ బెల్లం వినియోగానికి అనర్హంగా తేలిందని బోర్డు వెల్లడించింది. అనంతరం దానిని వేలం వేసి విక్రయించినట్లు కోర్టుకు వివరించింది.
బెల్లంపై హలాల్ గుర్తు ఎందుకు?
బెల్లం ప్యాకేజింగ్‌పై హలాల్ గుర్తు ఉండటానికి గల కారణాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారి కోర్టుకు వివరించారు. మహారాష్ట్రకు చెందిన తయారీ సంస్థ గల్ఫ్ దేశాలకు బెల్లాన్ని ఎగుమతి చేసేందుకు ప్యాకేజింగ్‌పై హలాల్ గుర్తును ముద్రించిందని తెలిపారు. అదే స్టాక్‌ను ఆలయ అవసరాలకు కూడా సరఫరా చేసినట్లు వెల్లడించారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతుల కోసం సరఫరాదారు హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నారని, ఫుడ్ సేఫ్టీ నిబంధనల పరంగా దీనివల్ల ఉల్లంఘన జరగలేదని అధికారులు కోర్టుకు తెలిపారు.
కోర్టు కీలక సూచనలు
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం దేవస్వం బోర్డుకు కీలక సూచనలు చేసింది. ఆలయ ప్రసాదం తయారీకి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. శబరిమలలో అనుసరించే మత విశ్వాసాలు, సంప్రదాయాలకు భిన్నమైన మతపరమైన సూచనలు లేదా గుర్తులు ఉండటం భక్తుల్లో అనుమానాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే లేదా భక్తుల్లో సందేహాలు కలిగించే గుర్తులు, చిహ్నాలు లేని పదార్థాలను మాత్రమే భవిష్యత్తులో సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఈ-టెండర్ నిబంధనల్లోనే స్పష్టమైన షరతులను చేర్చాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ఆదేశించింది. అనంతరం పిటిషన్‌ను హైకోర్టు ముగించింది.




















