హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనవాణి): సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అని తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజామున బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్, ఆమ్యునిషన్ కోర్టులో చోరీ జరిగింది. పలు తుపాకులు, పిస్టళ్లు, మ్యాగజైన్లు, భారీ మొత్తంలో బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌ను దొంగిలించారు. ఉదయం విధులకు వచ్చిన ఆర్మ్స్ కోర్టు ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనుమతి ఉన్న వారిపైనే తొలుత దర్యాప్తు
కేసును అత్యంత తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెల్ ఆఫ్ ఆర్మ్స్, ఆమ్యునిషన్ కోర్టులోకి ప్రవేశించే అవకాశం ఎవరెవరికి ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. ఆర్మ్స్ కోర్టు ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్‌తో పాటు ఆమ్యునిషన్ కోర్టు ఇన్‌ఛార్జ్ బల్లి మధులను ప్రశ్నించారు. అయితే వారిపై ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఆ తర్వాత గతంలో హవల్దార్లుగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్ రావు, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుపై విచారణ సాగించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా మల్లేశ్ కదలికలపై ప్రశ్నించినప్పటికీ అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదని డీజీపీ తెలిపారు.
ఫోన్ డేటా తొలగింపు.. విచారణలో అనుమానాస్పద ప్రవర్తన
విచారణకు మల్లేశ్ పూర్తిగా సహకరించలేదని పోలీసులు గుర్తించారు. తన ఫోన్‌లోని కాల్ వివరాలు, వాట్సాప్ సందేశాలను తొలగించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రశ్నల సమయంలో అతడి ప్రవర్తన, భయాందోళన కూడా పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి. కేసు తీవ్రతను మల్లేశ్ భార్యకు కూడా వివరించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో ఆమె భర్తను గట్టిగా ప్రశ్నించగా, చివరకు మల్లేశ్ తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.
గుంతలు తీసి పాతిపెట్టిన ఆయుధాలు
చోరీ చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తన స్వగ్రామం జంగంరెడ్డిపల్లిలో గుంత తీసి పాతిపెట్టినట్లు మల్లేశ్ తెలిపాడు. అలాగే యాప్రాల్ పరిధిలోని కౌకూరు ప్రాంతంలోనూ కొంత సామగ్రిని దాచినట్లు విచారణలో వెల్లడించాడు. మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి దొంగిలించిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎవరీ ఉప్పుతోళ్ల మల్లేశ్?
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన ఉప్పుతోళ్ల మల్లేశ్ (37) 2010లో భారత సైన్యంలో చేరాడు. సుమారు 16 ఏళ్ల పాటు ఆర్మీలో సేవలందించాడు. అనారోగ్య సమస్యలు, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30న అతడు పదవీ విరమణ పొందినట్లు డీజీపీ వెల్లడించారు. ఇంకా సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేయించడంపై మల్లేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ అసంతృప్తితోనే ముందస్తు ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ముందస్తు ప్రణాళికతోనే చోరీ
పోలీసుల వివరాల ప్రకారం, ఆగస్టు 31 అర్ధరాత్రి మల్లేశ్ మద్రాస్ రెజిమెంట్‌లోని కోట్ రూమ్, మ్యాగజైన్ రూమ్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేశాడు. అనంతరం వాటిని బయటకు తరలించి రెండు ప్రాంతాల్లో గుంతలు తీసి పాతిపెట్టాడు. ఈ కేసులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురికావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, చివరకు ప్రధాన నిందితుడిని గుర్తించి కేసును ఛేదించారు.
చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి
AK-203 తుపాకులు – 4 (5 మ్యాగజైన్‌లతో సహా)
5.56 ఎంఎం INSAS 1B1 తుపాకీ – 1 (3 మ్యాగజైన్‌లతో సహా)
9 ఎంఎం ఆటో 1A పిస్టళ్లు – 6 (12 మ్యాగజైన్‌లతో సహా)
సివిల్ 6.35 బోర్ పిస్టల్ – 1 (మ్యాగజైన్‌తో సహా)
ప్యాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్ – 1
9 ఎంఎం ఆటో పిస్టల్ బుల్లెట్లు – 1,156 రౌండ్లు
AK-203 బుల్లెట్లు – 720 రౌండ్లు
5.56 ఎంఎం INSAS బుల్లెట్లు – బాల్ 11, ట్రేసర్ 5, బ్లాంక్ రౌండ్లు 20




















