సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ తాజా ఫొటోలను బ్లాక్ అండ్ వైట్, సెపియా టోన్, పాతకాలపు దుస్తులు, హెయిర్‌స్టైల్, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్స్‌తో వింటేజ్ లుక్‌లోకి మార్చుకుంటున్నారు. యువత నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతల వరకు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
అయితే వైరల్ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ‘ఉచితంగా ఏఐ వింటేజ్ ఫొటో తయారు చేసుకోండి’, ‘ఒక్క క్లిక్‌తో రెట్రో లుక్ పొందండి’ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, మెసేజ్‌లను నమ్మి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు.
ఫేక్ APKలతో జాగ్రత్త
‘Retro Photo Editor’, ‘AI Photo Tool’ వంటి పేర్లతో సైబర్ నేరగాళ్లు నకిలీ APK ఫైళ్లను వ్యాప్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ‘ఫ్రీ వింటేజ్ ఫొటో’, ‘ప్రీమియం ఫీచర్లు ఉచితం’, ‘వాటర్‌మార్క్ ఉండదు’ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో యాప్‌లను డౌన్‌లోడ్ చేయించే ప్రయత్నం చేయవచ్చని హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ వెలుపల నుంచి APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సాధారణంగా ప్రత్యేక అనుమతులు అవసరం. తెలియని యాప్ కోసం ఇలాంటి అనుమతులు ఇచ్చి ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్‌లోని సున్నితమైన సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
SMSలు, OTPలు కూడా టార్గెట్ కావచ్చు
హానికరమైన యాప్ ఫోన్‌లోకి వచ్చిన తర్వాత అది కోరే అనుమతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేని SMS, ఫోన్, కాంటాక్ట్స్, ఇతర వ్యక్తిగత డేటాకు యాక్సెస్ ఇస్తే వాటిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా OTPలు, బ్యాంకింగ్ సంబంధిత సమాచారం వంటి సున్నితమైన డేటా చేతికి చిక్కితే అనధికారిక లావాదేవీలు, ఆర్థిక మోసాలు, గుర్తింపు దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రెట్రో ఫొటోలు చేసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SMS, WhatsApp, Facebook, Instagram, Telegram ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేయవద్దు.
తెలియని వెబ్‌సైట్ల నుంచి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.
ఫొటో ఎడిటింగ్ కోసం అధికారిక యాప్ స్టోర్లలోని నమ్మకమైన యాప్‌లనే ఉపయోగించాలి.
యాప్ కోరే అనుమతులను ఇన్‌స్టాల్ చేసే ముందు పరిశీలించాలి.
ఫొటో ఎడిటింగ్ యాప్‌కు అవసరం లేని SMS, Contacts, Phone, Banking వంటి అనుమతులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి.
‘ప్రీమియం ఫీచర్లు ఉచితం’, ‘ఒక్క క్లిక్‌తో ఫొటో’ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి వెంటనే స్పందించకూడదు.
ఏఐ ఫొటో టూల్‌ను ఉపయోగించే ముందు డెవలపర్ వివరాలు, విశ్వసనీయత, యాప్ అనుమతులు పరిశీలించాలి.
Loading Tweet...
మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి
ఇలాంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసి మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని శిఖా గోయల్ సూచించారు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించిన వాట్సాప్ నంబర్ 8712672222 ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
కొత్త సోషల్ మీడియా ట్రెండ్ కనిపించిన ప్రతిసారీ దాని వెనుక ఉన్న లింకులు, యాప్‌లను పరిశీలించకుండా ఉపయోగించడం ప్రమాదకరం. వింటేజ్ లుక్ కోసం ఫొటోను మార్చుకోవచ్చు.. కానీ అందుకోసం వ్యక్తిగత డేటాను పణంగా పెట్టకూడదు. అధికారిక, నమ్మకమైన మార్గాలను ఎంచుకోవడమే సురక్షితమని సైబర్ భద్రతా అధికారులు సూచిస్తున్నారు.




















