సైబరాబాద్, ఆగస్టు 07 (జనవాణి): బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. బోనాల పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కమిషనర్ ఎం. రమేశ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కుకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ప్రజల శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల బార్లకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆంక్షలే అమలులో ఉన్నాయి. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.




















