మంచిర్యాల, జూలై 30: భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో ఇల్లు కూలి గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేసి నిర్మిస్తామని, అలాగే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ముఖ్యంగా పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ నివసించవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు చెన్నూరులో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.





















