పెద్దపల్లి, జూలై 29: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తదితర అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండి సేవలందిస్తారని కమిషనర్ తెలిపారు.

వాగులు, నదుల వద్దకు వెళ్లొద్దు
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, గోదావరి, మానేరు నదుల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉందని, ప్రజలు వాటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షపు నీటి కారణంగా రహదారులపై వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని.. వాహనదారులు వేగంగా వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. అలాగే పిల్లలు, యువకులు చెరువులు, నదుల వద్ద సెల్ఫీలు దిగేందుకు లేదా ఈత కొట్టేందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.




















