ఆయన ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లొచ్చు.. మీరు జర్మన్ భాష నేర్చుకుంటే తప్పా.. కేటీఆర్‌పై వివేక్ వెంకటస్వామి ఫైర్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే పెద్దపీట వేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు.

4 ఆగస్టు, 2026 1:55 PM•ByRalin

Share this article

ఆయన ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లొచ్చు.. మీరు జర్మన్ భాష నేర్చుకుంటే తప్పా.. కేటీఆర్‌పై వివేక్ వెంకటస్వామి ఫైర్

వేములవాడ ఏటీసీ భూమి పూజా కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్

వేములవాడ, ఆగస్టు 4: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే పెద్దపీట వేసిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు. ప్రజల సొమ్మును వృథా చేసినవారే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

వేములవాడలో మంగళవారం నిర్వహించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎగతాళి చేస్తున్నారని అన్నారు. జర్మన్ భాష నేర్చుకుంటే జర్మనీలో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతుంటే, దానిపై కూడా విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

"ఇంగ్లిష్ నేర్చుకొని అమెరికా వెళ్లొచ్చు.. జర్మన్ నేర్చుకుంటే తప్పా?"

జర్మన్ భాష నేర్చుకుని విదేశాల్లో ఉద్యోగాలు సాధించేందుకు తెలంగాణ యువత సిద్ధమవుతుంటే కేటీఆర్ ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. "ఆయన ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లడం తప్పు కాకపోతే.. మీరు జర్మన్ భాష నేర్చుకుని జర్మనీకి వెళ్లడంలో తప్పేంటి?" అని ప్రశ్నించారు.

యువత భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే యువతను ప్రోత్సహించాల్సింది పోయి విమర్శించడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. టామ్‌కామ్ ద్వారా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం జరుగుతోందని, దానిని రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.

కాళేశ్వరం వల్ల వేల కోట్ల భారం

కాకా వెంకటస్వామి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గ్రావిటీ ఆధారంగా రూపకల్పన చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే సహజ ప్రవాహంతోనే నీరు చేరేదని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం వల్ల భారీ ఎత్తున పంపింగ్ చేయాల్సి వచ్చిందన్నారు.

పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చు అయ్యిందని ఆరోపించారు. అనంతరం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో ఆ నీటినే తిరిగి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలు, అవివేకపూరిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందన్నారు.

ఐటీఐలను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఐటీఐలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆరోపించారు. 65 ఐటీఐలు ఉన్నప్పటికీ వాటి ఆధునికీకరణకు నిధులు కేటాయించలేదన్నారు. మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు, అధ్యాపకుల నియామకంపై శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు ఐటీఐల్లో చేరేందుకు కూడా వెనుకంజ వేశారని విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అమలవుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రశంసించిందన్నారు.

దేశవ్యాప్తంగా అమలు చేయనున్న కొన్ని నైపుణ్యాభివృద్ధి కోర్సుల రూపకల్పన బాధ్యతను తెలంగాణకు అప్పగించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం సేతు (PM SETU) పథకంలో తెలంగాణకు నాలుగు క్లస్టర్లు రావడం కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ఉద్యోగాల కోసం ప్రభుత్వం అన్ని వేదికలను సిద్ధం చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయ విమర్శలను పక్కనబెట్టి నైపుణ్యాలు పెంపొందించుకుని దేశ, విదేశాల్లో ఉపాధి సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణను ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు