వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో లేకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేకపోవడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో ప్రశ్నించారు.

29 జులై, 2026 3:13 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో లేకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్, జులై 29: వరంగల్ జిల్లాలో ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశంపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, జిల్లాకు కేంద్ర సమాచార, ప్రచార వ్యవస్థలను విస్తరించాలని డిమాండ్ చేశారు.

గత మూడు సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో కేంద్ర సమాచార, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరిందో వివరాలు ఇవ్వాలని ఆమె కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరారు. అలాగే కమ్యూనిటీ రేడియో కేంద్రాలకు అందిస్తున్న సహాయం, మీడియా అవుట్‌రీచ్ కార్యక్రమాలు, ప్రజా అవగాహన ప్రచారాలు, కేంద్ర సంక్షేమ పథకాల ప్రచారం కోసం చేపట్టిన చర్యలపై కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేదని స్పష్టం చేశారు.

అయితే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని, అయినప్పటికీ వరంగల్‌లో అలాంటి కేంద్రం లేకపోవడం విచారకరమని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇక గత మూడు సంవత్సరాల్లో వరంగల్, పరిసర ప్రాంతాల్లో 17 ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

ఈ కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఓటరు అవగాహన, నషా ముక్త్ భారత్, పోషణ్ మాహ్ వంటి అంశాలపై ప్రచారం నిర్వహించినట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం వరంగల్ ప్రజలకు మరింత విస్తృతంగా చేరాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కమ్యూనిటీ రేడియో వంటి ప్రజా సమాచార వేదికలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. వరంగల్‌కు రావాల్సిన కేంద్ర సంస్థలు, అవకాశాలు, నిధులను సాధించేందుకు పార్లమెంట్‌లో నిరంతరం ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వరంగల్‌కు తగిన ప్రాధాన్యం దక్కేలా కృషి చేయడమే తన లక్ష్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు