నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై వ్యంగ్య నిరసనలతో వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. "బొద్దింకలతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థమైంది" అంటూ సెటైర్లు వేశారు.
జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, "నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం చేసే దిశగా ఇది తొలి విజయం. బొద్దింకలు ఒకసారి ఇంట్లోకి వస్తే వాటిని వెళ్లగొట్టడం ఎంత కష్టమో, ప్రజా ఉద్యమాన్ని కూడా అంత ఈజీగా అణచివేయలేరు" అని వ్యాఖ్యానించారు.
ఈ పోరాటం కేవలం ఒక పార్టీది కాదని, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల గళమని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు తమను తాము అజేయులుగా భావించకూడదని, ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని గుర్తుంచుకోవాలని సూచించారు. పాలకులను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేశారు.
జూన్ 6న ప్రారంభమైన నిరసన.. దేశవ్యాప్త ఉద్యమంగా
నీట్ పేపర్ లీక్ ఘటనపై జూన్ 6న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనతో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా నుంచి ప్రత్యేకంగా భారత్‌కు వచ్చిన అభిజీత్ దీప్కే స్వయంగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరవధిక నిరాహార దీక్షలో చేరడంతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. అదే సమయంలో విపక్షాల ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వంపై పెరిగింది.
ఇంకా రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ, తమ ఉద్యమం ఇక్కడితో ముగియదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తమ సంస్థ ఉంచిన రెండు ప్రధాన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదని, అవి నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.




















