సిద్దిపేట,సెప్టెంబర్ 01 (జనవాణి); ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సిద్దిపేటలోని శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీ బి.ఫార్మసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎం.ఫార్మసీ సీట్లు కోల్పోయే పరిస్థితి
2022-2026 బ్యాచ్‌కు చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని ఎం.ఫార్మసీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడంతో ఫేజ్-1 కౌన్సిలింగ్‌లో మంచి కాలేజీల్లో వచ్చిన సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము కన్వీనర్ కోటాలో కాలేజీలో చేరామని, ప్రభుత్వం-కాలేజీ మధ్య ఉన్న ఆర్థిక సమస్యలకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. సర్టిఫికెట్ల కోసం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
విద్యార్థుల వీడియోపై హరీశ్ రావు స్పందన
తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు చేసిన మేలుకంటే విధ్వంసమే ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ.. ప్రతిపక్షాలను విమర్శించడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.
Loading Tweet...




















