హైదరాబాద్, సెప్టెంబర్ 04 (జనవాణి): తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం పదవికి గౌరవం ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. దమ్ముంటే హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనపై ఎవరో ఒకరు పోటీ చేయడం తప్పదని, అవసరమని భావిస్తే హరీశ్‌రావు రాజకీయాలను పక్కనపెట్టి తన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు.
శుక్రవారం నిర్వహించిన ఇంటర్ విద్య JAC ‘జంగ్ సైరన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియేట్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేయాలన్న నిర్ణయంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడ మీద తలకాయ ఉన్నవాడు ఇలాంటి నిర్ణయం తీసుకోడని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇకపై తుగ్లక్ చర్యలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత స్టేక్‌హోల్డర్లను సంప్రదించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
ఇంటర్ విద్యను తీసేస్తే చూస్తూ ఊరుకోబోమని కవిత స్పష్టం చేశారు. ఇంటర్ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నిర్ణయం తీసుకుంటే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. 45 శాతం కనీస మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అనే నిబంధన ఎలా సాధ్యమవుతుందో అధికారులు వివరించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో 39 శాతం ఓట్లతోనే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. ఎన్నికల ఓట్లలో సీఎం రేవంత్ కూడా పాస్ కాలేదంటూ విమర్శించారు. ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేస్తే ‘కొరివితో తల గోక్కున్నట్లే’ అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.




















