హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన టెలివిజన్ అవార్డు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఎండీ ముకుంద రెడ్డి, కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టెలివిజన్ అవార్డుల కోసం ప్రత్యేక లోగో, అవార్డులకు పెట్టాల్సిన పేరు, ఏయే విభాగాల్లో పురస్కారాలు ఇవ్వాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, టెలివిజన్ రంగం అత్యధికంగా వినోదాన్ని అందించే మాధ్యమమని అన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాలను ఎక్కువగా వీక్షిస్తారని పేర్కొన్నారు.
టీవీ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న అన్ని విభాగాల కళాకారులు, సాంకేతిక నిపుణులు, సమాజానికి మంచి సందేశం ఇచ్చే సీరియల్స్, కార్యక్రమాలు, చిన్నారుల చిత్రాలను రూపొందించే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.
పీవీ పేరు అంశంపై సీఎంతో చర్చ
టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు పేరు పెట్టాలన్న కమిటీ సభ్యుల సూచనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి తెలిపారు.
పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడని, తెలంగాణ గర్వకారణమని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. అలాంటి మహనీయుల పేర్లను పరిశీలించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి
అవార్డుల పేరు, లోగో తెలంగాణ సంస్కృతి, ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని కమిటీకి మంత్రి సూచించారు. తొలి టెలివిజన్ అవార్డులు కావడంతో ప్రతి అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని కోరారు.
పూర్తి పారదర్శకతతో ఎంపిక
అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కమిటీ చైర్మన్, సభ్యులకు మంత్రి ఆదేశించారు. అలాగే ఎఫ్‌డీసీ ఎండీ ముకుంద రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అవార్డుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.
అవార్డుల కార్యక్రమం నిర్వహణకు సంబంధించి రెండు లేదా మూడు వేదికల ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. కమిటీ గైడ్‌లైన్స్, లోగో, అవార్డుల పేర్లకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేసి అందించాలని సూచిస్తూ, అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.




















