నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, వనితా విజయ్‌కుమార్, షిజు, వైవా రాఘవ్, కనకవ్వ తదితరులు
సంగీతం: రాకేశ్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాణం: కాశీ విశాలాక్షి బలుసు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
విడుదల: 14-08-2026
జానర్: మిస్టిక్ హారర్ థ్రిల్లర్
నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా మాత్రం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. ‘పొలిమేర’తో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దైవశక్తికి, క్షుద్రశక్తికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘అగధ’ ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టింది? థ్రిల్ పంచిందా?
కథేంటంటే?
మహాదేవి (కామాక్షి భాస్కర్ల)కు చిన్నప్పటి నుంచే దైవశక్తితో అనుబంధం ఏర్పడుతుంది. ఓ సాధువు వద్ద యంత్ర, తంత్ర విద్యలను నేర్చుకున్న ఆమె.. వాటిని ప్రజల మంచి కోసం ఉపయోగిస్తూ, అతీత శక్తుల బారి నుంచి బాధితులను కాపాడుతుంటుంది. ఈ క్రమంలో తన సొంత కుటుంబానికి అనూహ్యమైన ఆపద ఎదురవుతుంది.
మహాదేవి బాబాయ్ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటాయి. బాబాయ్ కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె ప్రియుడు సింహా (శ్రవణ్‌రెడ్డి) ఆచూకీ లేకపోవడం.. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పులు రావడంతో మహాదేవికి అనుమానాలు మొదలవుతాయి. ఈ మరణాల వెనుక సాధారణ కారణం లేదని ఆమె గుర్తిస్తుంది.
మహిమకు, ఆమె కుటుంబానికి ఎదురైన కష్టాల వెనుక ఉన్న ‘అగధ’ అనే క్షుద్రశక్తి ఎవరు? దానికి మహాదేవి కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి? అడవిలోని గుహలో అసలు ఏం జరిగింది? మహాదేవి గురువు ఈ దుష్టశక్తిని అడ్డుకోవడానికి చేసిన త్యాగం ఏమిటి? దైవశక్తి అండతో మహాదేవి అగధను ఎలా ఎదుర్కొంది? అన్నదే మిగతా కథ.
ఆసక్తికరంగా మొదలై.. ఊహించిన దారిలోకి..
హారర్ సినిమాకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడంలో దర్శకుడు ప్రారంభంలో సక్సెస్ అయ్యారు. అడవిలో యువతిని వెంటాడే సన్నివేశాలు, గుహ చుట్టూ జరిగే ఘటనలు, ఆ తర్వాత చోటుచేసుకునే మరణాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. మహాదేవి పాత్రను పరిచయం చేసే విధానం, ఆమెకు ఉన్న దైవిక శక్తులను చూపించిన తీరు కూడా ఆకట్టుకుంటాయి.
కుటుంబంలో వరుసగా అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడం, మహిమ ఆత్మ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం, సింహా పాత్రలో కనిపించే మార్పులు.. కథను ముందుకు నడిపిస్తాయి. ముఖ్యంగా అగధ ఎవరు? గుహలో ఏం జరిగింది? అనే ప్రశ్నలను ప్రేక్షకుల ముందు ఉంచి ఇంటర్వెల్ వరకు ఉత్కంఠను కొనసాగించారు.
అయితే ద్వితీయార్ధంలోనే సినిమా అసలు బలహీనత బయటపడుతుంది. ప్రథమార్ధంలో రేకెత్తించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో కథనం నెమ్మదిస్తుంది. అగధ గురించి మాటల్లో ఇచ్చిన బిల్డప్‌కు తగ్గ స్థాయిలో దాని ప్రభావాన్ని తెరపై చూపించలేకపోయారు. దైవశక్తి, దుష్టశక్తి మధ్య పోరాటం మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు నిరాశ కలిగిస్తాయి.
అయితే పూర్తిగా నిరాశపరిచే సినిమా కూడా కాదు. అడవి నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, గుహ ఎపిసోడ్, ఆత్మలు ఆవహించే సందర్భాలు హారర్ వాతావరణాన్ని నిలబెడతాయి. కొన్ని మలుపులు ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా కథానాయకుడి పాత్రలో వచ్చే మరో కోణం, అగధ ప్రభావం వివిధ వ్యక్తులపై పడే తీరు బాగానే అనిపిస్తుంది.
భయపెట్టడంలో ఇంకాస్త బలం కావాల్సింది..
‘అగధ’కు ప్రధానంగా హారర్, మిస్టిక్ అంశాలే బలం కావాలి. కానీ కొన్ని చోట్ల భయపెట్టే అవకాశాన్ని దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. అగధను ఎంతటి భయంకరమైన శక్తిగా మాటల్లో వర్ణించారో.. దానికి తగ్గ విధ్వంసాన్ని తెరపై చూపించడంలో మాత్రం తడబాటు కనిపిస్తుంది.
క్లైమాక్స్ కూడా భారీ పోరాటాన్ని ఆశించే ప్రేక్షకులకు అంతగా సంతృప్తి ఇవ్వదు. దైవశక్తి విజయం సాధిస్తుందనే విషయం ముందుగానే ఊహించగలిగినా.. ఆ పోరాటాన్ని ఎలా చూపిస్తారన్నదే ఇలాంటి సినిమాలకు కీలకం. అక్కడే ‘అగధ’ కొంత వెనుకబడింది. కథలోని మిస్టరీని మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే ఫలితం మరోలా ఉండేది.

కామాక్షి భాస్కర్లే ప్రధాన బలం
మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల ఆకట్టుకున్నారు. పాత్రకు తగ్గ లుక్, సీరియస్ బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించారు. సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరగడంతో బాధ్యతను సమర్థంగా మోశారు. అయితే కొన్ని సన్నివేశాల్లో హావభావాలు ఒకే విధంగా అనిపించడం మైనస్.
శ్రవణ్‌రెడ్డికి భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర దక్కింది. తన పాత్రలోని మలుపులను బాగానే పండించారు. ఉల్కా గుప్తా పరిమితమైన పాత్రలో ఆకట్టుకున్నారు. జోవికా విజయ్‌కుమార్‌కు లభించిన కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా ఆత్మ ప్రభావానికి లోనైన సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. భానుచందర్, వనితా విజయ్‌కుమార్, షిజు తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతికంగా సినిమాకు బలం
సాంకేతిక విభాగం ‘అగధ’కు ప్రధాన బలం. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీలో అడవి, గుహ, చీకటి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించారు. విజువల్స్ చాలా సందర్భాల్లో సహజంగా, నాణ్యంగా కనిపిస్తాయి.
రాకేశ్ వెంకటాపురం నేపథ్య సంగీతం హారర్ సన్నివేశాలకు బాగా ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాల్లో భయాన్ని పెంచడంలో ఆర్‌ఆర్ కీలక పాత్ర పోషించింది. రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైన్ కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కొన్ని చోట్ల సీజీ, వీఎఫ్‌ఎక్స్ మాత్రం అంత ప్రభావవంతంగా అనిపించవు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉంటే ద్వితీయార్ధం మరింత వేగంగా సాగేది.
మొత్తంగా ‘అగధ’లో మంచి కథా నేపథ్యం ఉంది. హారర్ వాతావరణం ఉంది. ఆసక్తికరమైన కొన్ని మలుపులూ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కలిపి ప్రేక్షకుడికి గుర్తుండిపోయే స్థాయి మిస్టిక్ థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ద్వితీయార్ధం, క్లైమాక్స్ విషయంలో మరింత బలమైన స్క్రీన్‌ప్లే అవసరమైంది. కామాక్షి భాస్కర్ల నటన, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్లస్ పాయింట్లు. కొత్తదనం, గూస్‌బంప్స్ మూమెంట్స్ ఆశించే హారర్ ప్రేక్షకులకు మాత్రం అంచనాలను కొంత తగ్గించుకుని వెళ్తేనే మంచిది.
బలాలు:
+ కథా నేపథ్యం,
+ కామాక్షి నటన,
+ అడవి–గుహ ఎపిసోడ్లు
బలహీనతలు:
- నెమ్మదించే ద్వితీయార్ధం,
- అగధ పాత్రను మరింత బలంగా చూపించకపోవడం,
- క్లైమాక్స్,
చివరిగా: భయపెట్టే ప్రయత్నం బాగుంది.. కానీ అగధ మ్యాజిక్ పూర్తిస్థాయిలో పనిచేయలేదు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.





















