తెలంగాణే జీవిత లక్ష్యం
తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.
ఉద్యమానికి సిద్ధాంత బలం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ప్రజలు ఎదుర్కొన్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత జయశంకర్ సార్‌కే దక్కుతుందని సీఎం తెలిపారు. ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.
ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన మార్గంలో తెలంగాణ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆశయాలను సాకారం చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.




















