హైదరాబాద్ : గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించిన 'చెన్నై లవ్ స్టోరీ' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. దర్శకుడు రవి అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి 'కలర్ ఫోటో', 'బేబి' చిత్రాలతో గుర్తింపు పొందిన సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ను మొదట ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'బేబి' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత అదే జోడీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించి ప్రారంభ దశలో పోస్టర్లు కూడా విడుదల చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది.
అయితే అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ కొంతకాలం నిలిచిపోయిందని, ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ ఇతర సినిమాలతో బిజీ కావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అదే సమయంలో వైష్ణవి చైతన్య కూడా కొత్త కమిట్‌మెంట్లతో బిజీ కావడంతో ఆ కాంబినేషన్ కొనసాగలేదని టాక్ వినిపిస్తోంది.
ఆ తర్వాత కథ కిరణ్ అబ్బవరం వద్దకు వెళ్లగా, హీరోయిన్‌గా శ్రీ గౌరీ ప్రియను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొత్త జోడీ కావడంతో ప్రేక్షకులకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ కలిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే... తొలి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, ఎమోషనల్ ట్రాక్‌కు మంచి స్పందన వస్తోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే రెండో భాగం నెమ్మదిగా సాగిందని, అక్కడక్కడా ఎడిటింగ్ ఇంకాస్త కుదించి ఉంటే సినిమా మరింత ప్రభావం చూపేదని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మొత్తం మీద ఒక మంచి లవ్ డ్రామాగా నిలుస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇదే సమయంలో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలకు మిశ్రమ స్పందన రావడం కూడా 'చెన్నై లవ్ స్టోరీ'కి కొంతమేర కలిసివచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.




















