ఫోటోలో వరుడు ఒకరు.. పెళ్లి మండపంలో మరో వ్యక్తి! షాక్‌తో పెళ్లి ఆపేసిన వధువు

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చూపుల సమయంలో తనకు చూపించిన వరుడి ఫొటోలో ఉన్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తి పెళ్లికొడుకుగా రావడంతో వధువు షాక్‌కు గురైంది. తనకు చూపించిన ఫొటో వేరు.. పెళ్లి మండపంలో ఉన్న వ్యక్తి వేరని ఆరోపిస్తూ పెళ్లిని నిరాకరించింది. దీంతో ఘనంగా జరగాల్సిన వివాహం అర్థాంతరంగా ఆగిపోయింది.

19 ఆగస్టు, 2026 4:38 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఫోటోలో వరుడు ఒకరు.. పెళ్లి మండపంలో మరో వ్యక్తి! షాక్‌తో పెళ్లి ఆపేసిన వధువు

Social Media Image

సినిమాల్లో కనిపించే ట్విస్ట్‌ను తలపించే ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పెళ్లి చూపుల సమయంలో తనకు చూపించిన వరుడి ఫొటో నచ్చడంతో ఓ యువతి వివాహానికి అంగీకరించింది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అయితే పెళ్లి రోజు వరుడు మండపంలోకి అడుగుపెట్టగానే అసలు ట్విస్ట్ బయటపడింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా గురు హర్ సహాయ్ ప్రాంతంలోని టిటూఖేరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఫోటోలో వరుడు ఒకరు.. పెళ్లి మండపంలో మరో వ్యక్తి!

రాజస్థాన్‌లోని ఛత్తర్‌గఢ్ నుంచి వరుడి కుటుంబం ఊరేగింపుగా వివాహ వేడుకకు వచ్చింది. పెళ్లి తంతు ప్రారంభం కావడానికి ముందు వధువు వరుడిని చూసింది. వెంటనే అతడిని చూసి షాక్‌కు గురైన ఆమె.. తనకు చూపించిన ఫొటోలో ఉన్న వ్యక్తి ఇతను కాదని చెప్పింది.

‘ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను’

తన జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి విషయంలో తాను మోసపోయానని వధువు ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ఫొటో చూపించి మరో వ్యక్తితో పెళ్లి చేయడం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించింది. ఊరేగింపుగా వచ్చిన వరుడిని తాను వివాహం చేసుకోలేనని స్పష్టం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వధువు తన నిర్ణయం మార్చుకోలేదు.

ఆరోపణలను ఖండించిన వరుడి కుటుంబం

అయితే వధువు ఆరోపణలను వరుడి కుటుంబం పూర్తిగా ఖండించింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం కుదిరిందని, పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు ఫోన్‌లో మాట్లాడుకున్నాయని వారు తెలిపారు. మధ్యవర్తులు, వధువు తల్లి ఇచ్చిన ఫొటోలనే తాము పంపించామని వరుడి తాత మహేంద్ర సింగ్ పేర్కొన్నారు. తమను వధువు కుటుంబమే మోసం చేసిందని, పెళ్లి ఏర్పాట్ల కోసం తమ నుంచి డబ్బులు తీసుకున్నారని వరుడి కుటుంబం ఆరోపించింది.

పోలీసుల జోక్యం లేకుండానే పరిష్కారం

ఈ వివాదంపై వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసుల జోక్యంతో సమస్య మరింత పెద్దదవుతుందని భావించిన ఇరు కుటుంబాలు పరస్పరం చర్చించుకుని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. చివరకు పెళ్లి మాత్రం జరగలేదు. భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ వివాహం అర్థాంతరంగా నిలిచిపోవడంతో వరుడి కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు