చాట్‌జీపీటీ సాయంతో తప్పిపోయిన తాత ఆచూకీ

మతిమరుపుతో తీర్థయాత్ర బృందం నుంచి తప్పిపోయి పొరపాటున బీహార్ రైలు ఎక్కిన పంజాబ్‌కు చెందిన వృద్ధుడు చమన్ లాల్.. ఏకంగా 1,200 కిలోమీటర్ల దూరంలోని గయాకు చేరుకున్నాడు. ఆకలితో, ఆందోళనతో ఉన్న ఆయనకు నీరజ్ అనే స్థానికుడు ఆశ్రయం కల్పించాడు. వృద్ధుడు చెప్పిన గ్రామం ఆచూకీ కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించిన నీరజ్ సాంకేతికత సాయంతో ఆయన కుటుంబాన్ని గుర్తించి తిరిగి కలిపాడు.

25 సెప్టెంబర్, 2026 7:52 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చాట్‌జీపీటీ సాయంతో తప్పిపోయిన తాత ఆచూకీ

టెక్నాలజీ మనుషుల జీవితాలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా మానవత్వానికి సాంకేతికత తోడైన ఓ ఘటన పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తీర్థయాత్రలో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన ఓ వృద్ధుడిని చాట్‌జీపీటీ సాయంతో ఓ వ్యక్తి తిరిగి కుటుంబంతో కలిపాడు.

పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ ప్రభుత్వ తీర్థయాత్ర పథకంలో భాగంగా అమృత్‌సర్‌కు వెళ్లారు. అయితే మతిమరుపు కారణంగా యాత్రా బృందం నుంచి విడిపోయారు. ఈ క్రమంలో పొరపాటున బీహార్ వెళ్లే రైలు ఎక్కి గయా స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన స్వస్థలానికి ఏకంగా 1,200 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయారు.

గయా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆకలితో, ఆందోళనతో ఉన్న చమన్ లాల్‌ను నిర్మాణ రంగంలో పనిచేసే నీరజ్ అనే స్థానికుడు గమనించాడు. వృద్ధుడి పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన చమన్ లాల్‌ను తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం అందించాడు. అంతేకాకుండా నాలుగు రోజుల పాటు ఆయనకు ఆశ్రయం కల్పించాడు. అనంతరం వృద్ధుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా తన ఊరి పేరు ‘ఫతేగఢ్ గుజ్రాన్’ అని చమన్ లాల్ పంజాబీలో చెప్పాడు. పంజాబ్ గురించి పెద్దగా అవగాహన లేని నీరజ్ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకునేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయించాడు.

చాట్‌జీపీటీ ఇచ్చిన సమాచారంతో ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామం లూధియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ఉన్నట్లు నీరజ్ తెలుసుకున్నాడు. వృద్ధుడిని ఒంటరిగా పంపితే మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి స్వయంగా ఆయనను రైలులో లూధియానాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మచ్చివారాకు చేరుకున్న నీరజ్ చమన్ లాల్ ఫొటోను చూపిస్తూ స్థానికులను ఆరా తీశాడు. ఈ క్రమంలో ఓ స్థానిక ఉపాధ్యాయుడు వృద్ధుడిని గుర్తించాడు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

చమన్ లాల్ కనిపించకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు సమాచారం అందగానే మచ్చివారాకు చేరుకున్నారు. తమ తాతను క్షేమంగా చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇంత దూరం నుంచి వృద్ధుడిని తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించిన నీరజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీరజ్‌ను తమ గ్రామానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మానవత్వానికి టెక్నాలజీ తోడైతే ఎలాంటి ఫలితం సాధ్యమో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

▶CategoriesIndia, National and News
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు