వయసు 59.. పట్టుదల మాత్రం తగ్గలేదు! 27 ఏళ్ల తర్వాత సర్కార్ ఉద్యోగం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 1999 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా నియమితులయ్యారు. పలుమార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఇంటర్వ్యూల వద్ద ఎదురైన నిరాశలను అధిగమించి చివరకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.

26 సెప్టెంబర్, 2026 10:56 AM•ByNarender Kumar Nangunoori

Share this article

వయసు 59.. పట్టుదల మాత్రం తగ్గలేదు! 27 ఏళ్ల తర్వాత సర్కార్ ఉద్యోగం

లక్నో,సెప్టెంబర్ 26 (జనవాణి): పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ నిరూపించారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. భాగ్‌పట్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన శర్మ.. పదవీ విరమణకు కొద్ది సంవత్సరాల ముందు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు.

1999లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన విజయ్ కుమార్ శర్మ, ఇన్నేళ్లుగా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ఈ ప్రయాణంలో ఆరుసార్లు టీజీటీ, నాలుగుసార్లు పీజీటీ రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు.. ఎనిమిదిసార్లు ఇంటర్వ్యూ దశ వరకు వెళ్లారు. అయితే ప్రతిసారీ తుది ఎంపికలో నిరాశే ఎదురైంది.

ఈసారి మాత్రం పరిస్థితులు ఆయనకు అనుకూలించాయి. నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూను ప్రభుత్వం తొలగించడంత రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరిగింది. దీంతో ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం శర్మకు దక్కింది.

సెప్టెంబర్ 22న లక్నోలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. షామ్లీ జిల్లాలోని ఓ ఎయిడెడ్ సెకండరీ పాఠశాలలో సంస్కృతం ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే శర్మ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఎన్నోసార్లు నిరాశ ఎదురైనా ప్రయత్నాన్ని కొనసాగించారు.

ప్రస్తుతం 59 ఏళ్ల 8 నెలల వయసులో ఉన్న విజయ్ కుమార్ శర్మకు ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కావడంతో రెండేళ్లకు పైగా మాత్రమే సేవలందించే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామక పత్రం అందుకోవడం తన జీవితంలో గొప్ప విజయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ శర్మ తండ్రి కూడా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తండ్రి అడుగుజాడల్లో నడవాలన్న ఆయన కల.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నిజమైంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు