అస్సాం, ఆగస్టు 31 (జనవాణి): అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 జైళ్లలో ఏప్రిల్ నుంచి జులై మధ్య నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో 226 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా (HIV-positive) తేలింది. అధికారిక సమాచారం ప్రకారం గుర్తించిన కేసుల్లో సుమారు 95 శాతం మంది ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్లు ఉన్నట్లు వెల్లడైంది. అంటే ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల హెచ్ఐవీ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం 226 మంది హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీల్లో 202 మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) తీసుకుంటున్నారు.
శ్రీభూమి జిల్లా జైలులోనూ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ జైలులో 445 మంది ఖైదీలు ఉండగా.. వారిలో 11 మందికి హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నవారేనని జైలు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఒకరు మహిళా ఖైదీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు శ్రీభూమి జైలు అధికారికంగా 187 మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నప్పటికీ, ప్రస్తుతం 445 మందిని ఉంచడం గమనార్హం. దీంతో జైలులో అధిక రద్దీ (Overcrowding) సమస్య కూడా మరోసారి చర్చకు వచ్చింది.
ఈ పరిణామాలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. జైళ్లలో హెచ్ఐవీ కేసుల పెరుగుదలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఖైదీలు జైలులో ఉన్న సమయంలోనే ఇన్ఫెక్షన్‌కు గురయ్యారా? లేక అంతకుముందే వైరస్ సోకిందా? అనే అంశంపై వివరమైన దర్యాప్తు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.




















