కొండా సురేఖను అవమానించారు... రాహుల్ గాంధీపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ ఫైర్

రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు డొల్ల మాటలేనని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

4 సెప్టెంబర్, 2026 6:46 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండా సురేఖను అవమానించారు... రాహుల్ గాంధీపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ ఫైర్

ఢిల్లీ,సెప్టెంబర్ 04 (జనవాణి): లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రసంగాలేనని ఆమె విమర్శించారు.

మీడియాతో మాట్లాడిన బన్సూరీ స్వరాజ్.. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ మహిళా నాయకురాలు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. కొండా సురేఖ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. ఆమె చేసిన అన్యాయం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని బన్సూరీ ప్రశ్నించారు. మహిళా సాధికారత, పితృస్వామ్య నిర్మూలనపై రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని విమర్శించారు.

కొండా సురేఖ వ్యవహారంపై చర్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే సుస్మితా పటేల్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కొండా సురేఖ, కొండా మురళి స్పష్టం చేశారు. మరోవైపు ఆమె వ్యాఖ్యలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. సుస్మితా వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడంపై కూడా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించిన కమిటీ.. దానితో సంతృప్తి చెందలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.

కేబినెట్ నుంచి కొండా సురేఖ తొలగింపు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు లేఖ రాసి ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేశారు. సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొండా సురేఖ మంత్రి పదవికి ముగింపు పలికినట్లైంది. ఈ పరిణామాన్ని ప్రస్తావిస్తూ బన్సూరీ స్వరాజ్.. రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించారు. మహిళలపై వివక్ష, పితృస్వామ్యంపై మాట్లాడే రాహుల్.. సొంత పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు