కర్ణాటక, ఆగస్టు 31 (జనవాణి): సండే పార్టీ సందర్భంగా స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడనే కారణంతో స్నేహితుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెలగావిలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సీతారామ్, అరుణ్ బెలగావిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మరో నలుగురితో కలిసి ఓ షెడ్‌లో నివసిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో అందరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. పార్టీ కోసం చికెన్ వండుకుని భోజనం చేసేందుకు కూర్చున్నారు. ఈ సమయంలో చికెన్ ముక్కల విషయంలో సీతారామ్, అరుణ్ మధ్య వివాదం మొదలైంది. అరుణ్ ఎక్కువ చికెన్ ముక్కలు తింటున్నాడంటూ సీతారామ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అరుణ్ వంట చేసేందుకు ఉపయోగించే కత్తితో సీతారామ్ ఛాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సీతారామ్ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండటంతో అరుణ్ అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే వైద్యులకు అసలు విషయం చెప్పకుండా భవనం పైనుంచి కిందపడిపోయాడని అబద్ధం చెప్పాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. అరుణ్ వ్యవహారంపై అనుమానం రావడంతో అతడిని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో చివరకు చికెన్ ముక్కల విషయంలో జరిగిన గొడవలో కత్తితో పొడిచినట్లు అరుణ్ అంగీకరించాడు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారామ్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















