Vande Bharat Sleeper Train | అక్టోబర్ 3 (జనవాణి): దేశంలో వందేభారత్ స్లీపర్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దూరప్రాంతాలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ఈ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే కేఎస్ఆర్ బెంగళూరు–ముంబై సీఎస్ఎంటీ మధ్య వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో సేవలు ప్రారంభించనుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే దేశంలో పట్టాలెక్కే రెండో వందేభారత్ స్లీపర్ రైలుగా నిలవనుంది. దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును జనవరిలో ప్రారంభించారు. ఇది హౌరా–కామాఖ్య మధ్య రాకపోకలు సాగిస్తోంది.
బెంగళూరు–ముంబై మధ్య 16 గంటల ప్రయాణం
కొత్తగా అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలు బెంగళూరు, ముంబై నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడిచే ప్రత్యక్ష రైళ్లలో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ కీలకమైనది. ఇది బెంగళూరు నుంచి ముంబై చేరుకోవడానికి సుమారు 24 గంటల సమయం తీసుకుంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు మాత్రం సుమారు 16 గంటల్లోనే బెంగళూరు నుంచి ముంబై చేరుకునేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం.
వారానికి ఆరు రోజులు సర్వీస్
కేఎస్ఆర్ బెంగళూరు నుంచి సోమవారం మినహా మిగిలిన రోజుల్లో రాత్రి 10 గంటలకు ఈ రైలు బయలుదేరనుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రైలు ప్రారంభ తేదీని రైల్వే అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే సర్వీసును ప్రారంభించే అవకాశం ఉంది.
ఏపీలో ఆ రెండు స్టేషన్లలోనే హాల్ట్
ఈ వందేభారత్ స్లీపర్ రైలు హుబ్బళ్లి మీదుగా ప్రయాణించకుండా ఆంధ్రప్రదేశ్ మీదుగా ముంబై వైపు వెళ్లనుంది. రాష్ట్రంలో అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ ఉండనుంది. ఏపీ తర్వాత కర్ణాటకలోని రాయచూర్, కలబురగి మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సోలాపూర్, పుణె, కళ్యాణ్ స్టేషన్లలో ఆగి ముంబై సీఎస్ఎంటీకి చేరుకోనుంది.
రైలు మార్గం ఇదే..
కేఎస్ఆర్ బెంగళూరు
అనంతపురం – ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు – ఆంధ్రప్రదేశ్
రాయచూర్ – కర్ణాటక
కలబురగి – కర్ణాటక
సోలాపూర్ – మహారాష్ట్ర
పుణె – మహారాష్ట్ర
కళ్యాణ్ – మహారాష్ట్ర
ముంబై సీఎస్ఎంటీ – మహారాష్ట్ర
దీంతో బెంగళూరు–ముంబై మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు.. అనంతపురం, గుంతకల్లు ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఈ కొత్త వందేభారత్ స్లీపర్ రైలు ఉపయోగపడే అవకాశం ఉంది.




















