బెంగళూరు,సెప్టెంబర్ 29 (జనవాణి): కెరీర్, జీతం, కార్పొరేట్ జీవితం.. నేటి యువతలో చాలామంది వీటినే విజయానికి కొలమానంగా భావిస్తారు. అయితే, కొందరు మాత్రం తమ జీవితంలో ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. బెంగళూరులో ఓ యువతి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన్వి అనే కంటెంట్ క్రియేటర్ ఆమె ఆటోలో ప్రయాణించిన సందర్భంగా ఈ విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆటో నడుపుతున్న యువతి అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటంతో తన్వికి తొలుత ఆశ్చర్యం కలిగిందట. ఆ తర్వాత ఆమెతో మాట్లాడగా తన నేపథ్యం, ఉద్యోగాన్ని వదిలేయడానికి గల కారణాలను తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయినట్లు తన్వి తెలిపారు.
ఆ యువతి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. తండ్రి మరణించిన తర్వాత తల్లి ఒంటరిగా మిగిలిందని, ఆమెకు అండగా ఉండేందుకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పింది. ముఖ్యంగా రాత్రి షిఫ్టుల కారణంగా తల్లికి దూరంగా ఉండాల్సి రావడం తన నిర్ణయానికి ప్రధాన కారణమని వెల్లడించినట్లు తన్వి పేర్కొన్నారు.
ఉద్యోగం మానేయవద్దని బంధువులు, స్నేహితులు సూచించినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. తనకు అనుకూలమైన సమయంలో పని చేసుకునే స్వేచ్ఛ ఉండటంతోనే ఆటో డ్రైవింగ్‌ను ఎంచుకున్నట్లు తెలిపింది.
“జీవితంలో మనకు నచ్చినట్టుగా ఉండేందుకు సమాజం అనుమతి కావాలా?” అంటూ యువతి ప్రశ్నించినట్లు తన్వి తెలిపారు. ఈ మాట తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు. ధైర్యం అంటే సాహసాలు చేయడం మాత్రమే కాదని మనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడానికి కూడా కొన్నిసార్లు అసాధారణమైన ధైర్యం అవసరమని తన్వి అభిప్రాయపడ్డారు. ఆ యువతి నిర్ణయం తనకు స్ఫూర్తినిచ్చిందని, ఆమెపై గౌరవం కలిగిందని తెలిపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యువతి నిర్ణయంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కెరీర్ కంటే కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.




















