ఢిల్లీ, సెప్టెంబర్ 12 (జనవాణి): భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ దేశాల ఉమ్మడి న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో కీలక దౌత్య విజయం దక్కింది. శిఖరాగ్ర సమావేశం తొలిరోజు చర్చల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఏ సభ్య దేశం కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.
విభేదాల మధ్య ఏకాభిప్రాయం
బ్రిక్స్‌లోని సభ్య దేశాల మధ్య పలు అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా పరిస్థితులు, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల మధ్య ఉన్న విభేదాలు డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయ సాధనను సవాలుగా మార్చాయి. అయితే ఈ విభేదాలను అధిగమిస్తూ అన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారత్ కీలకంగా వ్యవహరించింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. డిక్లరేషన్‌పై చర్చలు తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
భారత్ దౌత్య నైపుణ్యానికి నిదర్శనం
బ్రిక్స్ కూటమి ఏకాభిప్రాయ ప్రాతిపదికన పనిచేసే వేదిక. తుది ఉమ్మడి ప్రకటనకు ఒక్క సభ్య దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా దాని ఆమోదం నిలిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం లభించడం భారత్ దౌత్యపరమైన కృషికి నిదర్శనంగా నిలిచింది. వివిధ దేశాల వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కారణంగా సున్నితమైన అంశాలపై చర్చలు సుదీర్ఘంగా సాగాయి. ఈ క్రమంలో భారత్ అన్ని పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విభేదాల మధ్య మధ్యేమార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేసింది.
గ్లోబల్ సౌత్‌కు సమాన భాగస్వామ్యం
ఇదిలా ఉంటే.. మారుతున్న ప్రపంచాన్ని కాలం చెల్లిన అంతర్జాతీయ సంస్థలతో నడిపించలేమని బ్రిక్స్ సమావేశంలో జరిగిన చర్చలు స్పష్టం చేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థల్లో ప్రాతినిధ్యం, స్పందన, నియమాల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని అన్నారు.
భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధితో పాటు వాటిని నియంత్రించే నిబంధనల రూపకల్పనలోనూ గ్లోబల్ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్ణయాలకు, వాటి ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని భాగస్వామ్యం, సామూహిక చర్యల ద్వారా పూడ్చాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని, అందులోని తీర్మానాలను ఆచరణలో స్పష్టమైన ఫలితాలుగా మార్చడం ఇప్పుడు సభ్య దేశాల బాధ్యత అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.




















