6 స్థానాలకు ఉప ఎన్నికలు: బెంగాల్ నుంచి తమిళనాడు వరకు.. ఎవరి బలమెంతో తేల్చే పరీక్ష!

దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీలకు కీలక పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

6 అక్టోబర్, 2026 1:13 PM•ByNarender Kumar Nangunoori

Share this article

6 స్థానాలకు ఉప ఎన్నికలు: బెంగాల్ నుంచి తమిళనాడు వరకు.. ఎవరి బలమెంతో తేల్చే పరీక్ష!

Bypol | దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాలు

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రెండు స్థానాల నుంచి గెలుపొందడంతో ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి రావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థిగా హసిరానీ రథ్ పోటీ చేస్తున్నారు. టీఎంసీ తరఫున రబియుల్ ఆలం చౌదరి బరిలో ఉండగా, రెబెల్ టీఎంసీ వర్గం నుంచి సఫియుజ్జమాన్ షేక్, కాంగ్రెస్ నుంచి మహ్మద్ అబ్దుల్లాహిల్ కాఫీ పోటీలో ఉన్నారు.

రెజినగర్‌లో ఏజేయూపీ తరఫున గోలం నబీ ఆజాద్ బరిలో నిలిచారు. ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్ కుమారుడు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ నెలకొంది. బెంగాల్‌లో కొత్త ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు తొలి కీలక ఎన్నికల పరీక్షగా మారాయి.

తమిళనాడులో విజయ్ పార్టీకి తొలి పరీక్ష

తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నికలు కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు రాజీనామా చేసిన వారినే టీవీకే తమ అభ్యర్థులుగా బరిలోకి దించింది. వారి విజయానికి టీవీకే అధినేత విజయ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు అన్నాడీఎంకే, డీఎంకేలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దించి ముమ్మర ప్రచారం చేపట్టాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు టీవీకేకు ప్రజల్లో ఉన్న ఆదరణను అంచనా వేసేందుకు కీలకంగా మారాయి.

అస్సాంలో నాగావ్ లోక్‌సభ స్థానానికి పోటీ

అస్సాంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ప్రద్యుత్ బోర్దోలోయ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిస్పూర్ స్థానం నుంచి విజయం సాధించడంతో నాగావ్ లోక్‌సభ సీటు ఖాళీ అయింది. ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా శిబామణి బోరా, బీజేపీ తరఫున దేవాశిష్ శర్మ పోటీ చేస్తున్నారు. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ కూడా బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

పుదుచ్చేరిలో 11 మంది అభ్యర్థులు

పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో తట్టంచావడి సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో తట్టంచావడి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా చూస్తే.. బెంగాల్‌లో అధికార బీజేపీకి, తమిళనాడులో టీవీకేకు, అస్సాంలో కాంగ్రెస్-బీజేపీలకు ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఆయా పార్టీల బలాబలాలను అంచనా వేసేందుకు ఈ ఫలితాలు కొంతమేర దోహదపడనున్నాయి. అక్టోబర్ 9న వెలువడే ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు