స్కూలుకు వెళ్లాల్సిన చిన్నారులను భిక్షాటనకు దింపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పిల్లల ముఖాలపై నిజమైన గాయాల్లా కనిపించేలా మేకప్ చేసి, వారిని రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటనకు ఉపయోగిస్తున్నట్లు ఓ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. సాధారణంగా పిల్లలకు స్నానం చేయించి, మంచి దుస్తులు వేసి, ముస్తాబు చేసి పాఠశాలకు పంపాల్సిన తల్లిదండ్రులే.. వారి ముఖాలపై నకిలీ గాయాలు సృష్టించి భిక్షాటనకు పంపుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రంగులు, కాటన్, బ్యాండేజీలను ఉపయోగించి గాయాల మాదిరిగా మేకప్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
గాయాలతో ఉన్న చిన్నారులను చూసి ప్రజలు జాలిపడి డబ్బులు ఇస్తారనే మానవత్వాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. గాయాలను చూపిస్తూ ఎలా భిక్ష అడగాలో పిల్లలకు నేర్పిస్తున్నారనే ఆరోపణలు మరింత కలవరపెడుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల బాల్యం, విద్య, భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి చర్యలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు వెంటనే స్పందించి.. భిక్షాటన వెనుక ఉన్న వ్యక్తులు లేదా ముఠాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




















