ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో మహిళపై దాడి కలకలం రేపింది. కేసు విచారణకు కుటుంబ సభ్యులతో కలిసి కోర్టుకు వచ్చిన మహిళపై ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది, లాయర్లు, ప్రజలు చూస్తుండగానే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమర్ధీరా చౌరాహా ప్రాంతానికి చెందిన ప్రియా త్రిపాఠికి మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అత్తింటివారిపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భరణం కోసం ఆమె కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణలో భాగంగా సెప్టెంబర్ 24న ప్రియా కుటుంబ సభ్యులతో కలిసి మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. అదే సమయంలో ఆమె భర్త మనీష్, ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మనీష్ ఆమె జుట్టు పట్టుకుని కిందపడేసి కొట్టడంతో పాటు గొంతు నులిమినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనను అడ్డుకునేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినప్పటికీ, కొంతసేపు దాడి కొనసాగినట్లు సమాచారం.
కోర్టులో కేసును కొనసాగిస్తే చంపేస్తామని భర్త, కుటుంబ సభ్యులు బెదిరించినట్లు ప్రియా పోలీసులకు తెలిపింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా ఫిర్యాదుతో పాటు పోలీసులకు అందించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, కోర్టు ప్రాంగణంలో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Loading Tweet...




















