జైపూర్,సెప్టెంబర్ 23 (జనవాణి): జైపూర్‌లో లగ్జరీ కార్ల వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలాజీ మార్కెట్‌లోని మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వర్క్‌షాప్‌లో పాతవి, కొత్తవి కలిపి 50కిపైగా కార్లు ఉన్నట్లు సమాచారం. మంటల తీవ్రతకు సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల విడిభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో దాదాపు 5 కిలోమీటర్ల పరిధి వరకు దట్టమైన పొగలు కనిపించాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు మరింత విస్తరించకముందే వర్క్‌షాప్‌లోని పలు కార్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో భారీగా ఆస్తి నష్టం జరగకుండా కొంతమేర నివారించగలిగారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




















