కోల్‌కతా, ఆగస్టు 19 (జనవాణి): కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. న్యూమార్కెట్ ప్రాంతంలోని ఫ్రీ స్కూల్ వీధిలో ఉన్న ఓ హోటల్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్‌లో ఉన్న పలువురు బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయారు. దట్టమైన పొగతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా బంగ్లాదేశీయులేనని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. వైద్య చికిత్స కోసం వారు కోల్‌కతాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హోటల్‌లోని మూడో అంతస్తులో ఏసీ పేలడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోనూ ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వరుస హోటల్ అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.




















