మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 8 (జనవాణి): మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య వరుస బదిలీల వ్యవహారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఏడాదిలో నాలుగోసారి బదిలీ కావడంతో ఆమె బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త పోస్టింగ్‌లో బాధ్యతలు చేపట్టి 50 రోజులు కూడా పూర్తికాకముందే మరోసారి బదిలీ జాబితాలో తన పేరు రావడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2011 బ్యాచ్‌కు చెందిన నేహా మార్వ్య (Neha Marvya) గిరిజన ప్రాంత అభివృద్ధి పథకం డైరెక్టర్‌గా, మధ్యప్రదేశ్ ఉపాధి, శిక్షణ మండలి (MEPSET) మేనేజింగ్ డైరెక్టర్‌గా, మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక, అభివృద్ధి సంస్థ ఎండీగా, గిరిజన పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే సెప్టెంబర్ 5న మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా బదిలీ ఉత్తర్వుల్లో ఆమె బాధ్యతలను కుదించారు. ఇకపై షెడ్యూల్డ్ తెగల ఆర్థిక, అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా మాత్రమే కొనసాగనున్నారు.
ఈ పరిణామంపై నేహా మార్వ్య ఐఏఎస్ అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన నియంత్రణలో లేని కొందరు ఉద్యోగులు తనపై తిరుగుబాటు చేశారని, వారు కార్యాలయంలో తన టేబుల్‌పై చేతులు కొడుతూ బదిలీ చేయిస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. సిబ్బంది అవిధేయత, ఫైళ్లను నిలిపివేయడం, దుష్ప్రవర్తన వంటి అంశాలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటారని భావించగా, అందుకు భిన్నంగా తననే వరుస బదిలీలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐఏఎస్ అధికారుల సంఘం తీరుపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు అండగా నిలవాల్సిన సంఘం కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితమైందా? అంటూ ప్రశ్నించారు. గతంలో తనకు జరిగిన బదిలీలను గౌరవంగా అంగీకరించానని, అయితే ఇలా పదేపదే బదిలీ చేయడం తనను నైతికంగా దెబ్బతీస్తోందని నేహా మార్వ్య పేర్కొన్నారు. ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వ, అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి.




















