ముంబై, ఆగస్టు 25 (జనవాణి): దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ ట్రైన్లు నగర ప్రజల రోజువారీ జీవనంలో కీలక భాగం. అయితే, భారీ రద్దీ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కొందరు మహిళలు వేగంగా వెళ్తున్న లోకల్ ట్రైన్ బయట వేలాడుతూ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక్కసారి పట్టు తప్పితే.. ప్రాణాలకే ప్రమాదం
ఓ ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ భుజానికి బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని కోచ్ వెలుపల గట్టిగా పట్టుకుని వేలాడుతూ కనిపించింది. రైలు వేగంగా దూసుకెళ్తున్నప్పటికీ ఆమె శరీరం మొత్తం కోచ్ బయటే ఉండటం భయానకంగా కనిపిస్తోంది. ఆమెకు సమీపంలో మరో మహిళ కూడా ఇదే తరహాలో ప్రయాణిస్తోంది. రైలు పచ్చని చెట్ల మధ్య నుంచి వేగంగా వెళ్తుండగా.. పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై మరో రైలు దూసుకెళ్లడం వీడియోలో కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం పట్టు జారినా తీవ్ర ప్రమాదం తప్పదని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘స్పిరిట్ ఆఫ్ ముంబై’ అంటూ సమర్థించొద్దు
వీడియోపై స్పందించిన పలువురు ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి ప్రాణాంతక ప్రయాణాలను ‘స్పిరిట్ ఆఫ్ ముంబై’ అంటూ రొమాంటిసైజ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రద్దీని నియంత్రించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “ప్రజలు రోజూ ఇలా ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిందేనా?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, ఇలాంటి ప్రమాదకర పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.




















