Noida Airport : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జెవార్ ఎయిర్‌పోర్టు) భారీ వర్షాలతో జలమయమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎయిర్‌పోర్టు ప్రాంగణంతో పాటు టెర్మినల్ బిల్డింగ్, విశాలమైన పార్కింగ్ ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో విమానాశ్రయం ఆవరణలో నీరు నిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని కొందరు నెటిజన్లు ఆరోపించారు. ‘ఎయిర్‌పోర్ట్ విత్ సీ పోర్ట్’, ‘రన్‌వేపై స్విమ్మింగ్ పూల్’ అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అధికారుల వివరణ
ఈ ఘటనపై నోయిడా ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో భారీ వర్షపాతం నమోదవడంతో డ్రైనేజీ వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిందని తెలిపారు. దీంతో కొంతమేర నీరు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి చేరిందని వివరించారు. నీరు చేరిన వెంటనే పంపింగ్ వ్యవస్థను ప్రారంభించి, సుమారు 30 నిమిషాల్లోనే పూర్తిగా తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా డ్రైనేజీ కాలువల సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఎయిర్‌పోర్టు అధికారులు హామీ ఇచ్చారు.




















