ఢిల్లీ,ఆగస్టు ౦7(జనవాణి): వందేమాతరం గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది.
1971లో అమల్లోకి వచ్చిన నేషనల్ ఆనర్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు జాతీయ గీతానికి మాత్రమే ఉన్న చట్టబద్ధ రక్షణను, తాజా సవరణలతో వందేమాతరం జాతీయ గేయానికి కూడా విస్తరించింది.
కొత్త నిబంధనల ప్రకారం, జాతీయ గీతం లేదా వందేమాతరం గేయాన్ని అవమానించడం, వాటి ఆలాపనను అడ్డుకోవడం లేదా అంతరాయం కల్పించడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గతంలో ఈ రక్షణలు నేషనల్ ఆనర్ చట్టంలోని సెక్షన్-3 ప్రకారం కేవలం జాతీయ గీతానికి మాత్రమే వర్తించేవి. తాజా సవరణతో వందేమాతరం గేయానికీ అదే స్థాయి చట్టపరమైన రక్షణ కల్పించారు.




















