సినీ తారలు తమకున్న ప్రజాదరణను బాధ్యతాయుతంగా వినియోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేసే ముందు సామాజిక బాధ్యతను గుర్తు చేసుకోవాలని అన్నారు. మంగళవారం జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో సినీ ప్రముఖులను ఉద్దేశించి రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత, చిన్నారులపై సినీ తారల ప్రభావాన్ని ప్రస్తావించిన ముర్ము.. ప్రముఖుల మాటలు, చేతలు కోట్లాది మంది ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. అందువల్ల తమకు లభించిన ప్రజాదరణను సమాజహితం కోసం ఉపయోగించాలని సూచించారు. 'రియల్ స్టార్స్ వెలుగును పంచాలి.. చీకటిని కాదు' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించే ముందు సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని రాష్ట్రపతి సూచించడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ.. చిన్నారులు, యువతపై సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రకటనల విషయంలో ప్రముఖులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
Loading Tweet...
అయితే మరికొందరు నెటిజన్లు మరో ప్రశ్నను లేవనెత్తారు. ఒక ఉత్పత్తి ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలకు తెలుసుంటే.. దాని తయారీ, విక్రయాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సమస్య కేవలం సెలబ్రిటీలు చేసే ప్రచారంతోనే పరిష్కారం కాదని, హానికరమైన ఉత్పత్తుల విషయంలో నియంత్రణ సంస్థలు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా.. పాన్‌మసాలా వంటి ఉత్పత్తుల ప్రకటనల్లో సినీ ప్రముఖులు కనిపించడంపై గతంలోనూ వివాదాలు చెలరేగాయి. గత ఆగస్టులో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే సంబంధిత ప్రకటనతో అనుబంధమున్న బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి తాజా వ్యాఖ్యలు మరోసారి సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్లపై చర్చకు తెరలేపాయి.





















