న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (జనవాణి): సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’ ముట్టడికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఈసీ కార్యాలయం వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈసీ కార్యాలయానికి కొద్ది దూరంలో రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి నిరసన తెలిపారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ఆందోళనకు దిగిన రాహుల్‌కు మద్దతుగా కార్యకర్తలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన తీవ్రతరం కావడంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు వాహనంలోకి తరలించారు. అయితే కొద్దిసేపటికే వారు వాహనం నుంచి బయటకు వచ్చి మరోసారి నిరసనలో పాల్గొన్నారు. అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చ్
పార్లమెంట్ భవనం నుంచి ‘నిర్వచన్ సదన్’ వరకు విపక్ష ఎంపీలు మార్చ్ నిర్వహించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాలతో బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. అయితే డీఎంకే, ఆప్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. ఈసీపై తమ పోరాటాన్ని కొనసాగించాలని విపక్ష పార్టీలు నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
ఆందోళనలను మరింత విస్తరించే దిశగా కాంగ్రెస్ ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ అంశంపై సోమవారం పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈసీపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్.. ‘సేవ్ ఓట్, సేవ్ డెమోక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించింది. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా మండల స్థాయిలో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఇక నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. నవంబర్ 25, 26 తేదీల్లో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Loading Tweet...




















