రాజీనామా వెనుక అసలు కారణం ఇదే..లేఖలో కీలక వ్యాఖ్యలు!

రాజీనామా చేసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీట్ వివాదం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చివరకు ఎందుకు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలను ఆయన ఆ లేఖలో స్పష్టంగా వివరించారు.

25 జులై, 2026 4:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రాజీనామా వెనుక అసలు కారణం ఇదే..లేఖలో కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ ఓ భావోద్వేగ లేఖ విడుదల చేశారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల నుంచి రాజీనామా వరకు అన్ని అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు.

అక్రమాలు వెలుగులోకి రాగానే చర్యలు

2026 మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు గుర్తించగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించేందుకు వెంటనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక వచ్చే ఏడాది నుంచి నీట్‌ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

20 లక్షల మంది విద్యార్థుల కోసం పునఃపరీక్ష

రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21న 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. జులై 16న విడుదలైన ఫలితాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.

బాధ్యత నుంచి ఎప్పుడూ తప్పుకోలేదు

ఈ ఘటన జరిగిన మొదటి రోజు నుంచే తానే పూర్తి బాధ్యత వహించానని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

రాజీనామా ఎందుకు చేశానంటే...

జంతర్-మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు, గత పది రోజులుగా దేశంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన ఆయన.. కొన్ని కీలక కారణాలతోనే రాజీనామా చేసినట్లు వివరించారు.

  • విద్యార్థులు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా, తమ సమయాన్ని పూర్తిగా చదువు, కెరీర్‌పైనే కేంద్రీకరించాలని కోరారు.

  • దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

  • కొందరు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

గత నాలుగు దశాబ్దాలుగా విద్యా రంగంలో సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడం గర్వకారణమన్నారు. శ్రీ జగన్నాథుడి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ భారత్ మాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువతకు సేవ చేస్తూనే ఉంటానని తన లేఖను ముగించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు