జేబులో పెట్టుకున్న కొత్త ఫోన్ పేలింది.. యువకుడికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడి జేబులో కొత్త స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. యువకుడి దుస్తులకు మంటలు అంటుకుని, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

13 ఆగస్టు, 2026 4:10 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జేబులో పెట్టుకున్న కొత్త ఫోన్ పేలింది.. యువకుడికి తీవ్ర గాయాలు

కొత్తగా కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా(Greater Noida) పరిధిలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్‌కు మజీద్ అనే యువకుడు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌ను జేబులో పెట్టుకుని ప్రయాణిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా విపరీతంగా వేడెక్కింది. ఫోన్‌ను జేబులోంచి బయటకు తీసేలోపే పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి మజీద్ దుస్తులకు మంటలు అంటుకోవడంతో పాటు రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్ పూర్తిగా ముక్కలైపోయింది. యువకుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. అనంతరం బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఫోన్ ఎందుకు పేలుతుంది?

స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతినడం, తయారీ సమయంలో ఏర్పడిన అంతర్గత లోపాలు వంటి కారణాలతో బ్యాటరీలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నాసిరకం లేదా అనుకూలత లేని ఛార్జర్లు, అధిక ఉష్ణోగ్రతలు, ఫోన్‌‌ని గంటల పాటు వాడటంతో హీట్ కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ అసాధారణంగా వేడెక్కడం, బ్యాటరీ ఉబ్బడం, వింత వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫోన్ వాడడం నిలిపివేయాలని, ముఖ్యంగా దెబ్బతిన్న బ్యాటరీలను స్వయంగా మార్చకుండా అధీకృత సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం సురక్షితమని చెబుతున్నారు. ఫోన్ అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకూ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు