చెన్నై,సెప్టెంబర్ 02 (జనవాణి): తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో ఇకపై స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 52 ప్రధాన దేవాలయాల్లో స్మార్ట్‌ఫోన్లను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఆలయాల్లో కొంతమంది భక్తులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియా కోసం రీల్స్, వీడియోలు చిత్రీకరిస్తుండటంతో ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీడియోల చిత్రీకరణతో ఇతర భక్తులకు అసౌకర్యం, ప్రశాంతతకు భంగం కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆలయాల్లో భక్తి వాతావరణాన్ని కాపాడటంతో పాటు సోషల్ మీడియా కోసం వీడియోలు తీసే సంస్కృతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఫోన్ల కోసం ప్రత్యేక కౌంటర్లు
ఆలయాలకు వచ్చే భక్తులు తమ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో భద్రపరచాలి. ఇందుకోసం ఒక్కో ఫోన్‌కు రూ.5 డిపాజిట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దర్శనం అనంతరం భక్తులు తమ ఫోన్లను తిరిగి తీసుకోవచ్చు. అయితే కెమెరా లేని సాధారణ కీప్యాడ్ మొబైల్ ఫోన్లను మాత్రం ఆలయంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆలయాల పవిత్రత, భక్తుల ప్రశాంతతను కాపాడేందుకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.




















