టీఆర్ఎస్ పేరు కేసు.. కవితకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఎన్నికల సంఘం నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

7 జులై, 2026 4:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

టీఆర్ఎస్ పేరు కేసు.. కవితకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన నోటీసులపై స్పందించేందుకు కవితకు మరో అవకాశం కల్పిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని పేర్కొంటూ ఎన్నికల సంఘం కవితకు నోటీసులు పంపింది. అయితే ఆ నోటీసులకు ఇప్పటివరకు స్పందించని కవిత.. మంగళవారం నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి అవకాశం కల్పించాలని ఆదేశించింది. అలాగే కవిత నుంచి వివరణ అందుకున్న అనంతరం ఆమెకు వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఇచ్చి, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది.

ఎన్నికల సంఘం వాదన ఇదే

విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని, అదే పేరును మరో పార్టీకి కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

అంతేకాకుండా టీఆర్ఎస్ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు అందాయని, గతంలో ఇలాంటి కేసుల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

కవిత తరఫు వాదనలు

మరోవైపు కవిత తరఫు న్యాయవాది.. టీఆర్ఎస్ పేరును కేటాయించాలంటూ కోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం ప్రతికూల నిర్ణయం తీసుకునే ముందు కవితకు తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

హైకోర్టు కీలక సూచనలు

ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. వారం రోజుల్లో కవిత సమాధానం సమర్పించిన అనంతరం ఆమె వ్యక్తిగత వాదనలు కూడా వినాలని, ఆ తర్వాతే టీఆర్ఎస్ పార్టీ పేరు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంలో కవితకు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు