జనవాణి: న్యూస్ డెస్క్ August 24: అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసిన హైదరాబాద్ యువకుడి జీవితం విషాదాంతమైంది. నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సాయిప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. అమెరికాలోని టెక్సాస్ శాన్ ఆంటోనియోలో ఈ నెల 21న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన సాయిప్రదీప్
హైదరాబాద్ దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సాయిప్రదీప్ 2024లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఇటీవలే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన సాయిప్రదీప్.. దాదాపు నాలుగు నెలలుగా వివిధ అవకాశాల కోసం వెతికినట్లు సమాచారం. అయితే సరైన ఉద్యోగం లభించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే..
అమెరికాలో చదువు పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం సాధించి స్థిరపడాలని సాయిప్రదీప్ భావించినట్లు తెలుస్తోంది. అయితే వరుసగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం దొరకకపోవడం ఆయనపై తీవ్ర ప్రభావం చూపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన డిప్రెషన్‌కు లోనైనట్లు సమాచారం. ఈ నెల 21న శాన్ ఆంటోనియోలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
కుటుంబంలో విషాదం
సాయిప్రదీప్ మరణవార్తతో హైదరాబాద్‌లోని ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నత చదువులు పూర్తి చేసి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు ఇలా అర్ధంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విదేశాల్లో చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒత్తిడి, నిరాశ ఎదురైతే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.




















