Earthquake: టిబెట్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మాలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
టిబెట్‌లో సంభవించిన ఈ భూకంపం ప్రభావంతో పొరుగున ఉన్న నేపాల్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే భూకంప తీవ్రతపై వివిధ సంస్థల మధ్య స్వల్ప తేడా ఉంది. టిబెట్‌లో భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు భారత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) పేర్కొంది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత గురువారం కూడా టిబెట్‌లో భూకంపం సంభవించింది. అప్పట్లో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఆ భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది.




















