మమల్నిగెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఒక్కొక్కరికీ 5 వేల డాలర్లు..ట్రంప్ సంచలన హామీ

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చట్టసభల్లో రిపబ్లికన్లకు మెజారిటీ కట్టబెడితే వయోజన అమెరికన్లకు ఒక్కొక్కరికీ 5,000 డాలర్ల ‘డివిడెండ్’ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు సాధ్యమేనా? ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు ఇస్తామని చెప్పడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.

10 సెప్టెంబర్, 2026 2:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మమల్నిగెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఒక్కొక్కరికీ 5 వేల డాలర్లు..ట్రంప్ సంచలన హామీ

Social Media Image

అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చట్టసభల్లో మెజారిటీ దక్కేలా చేయాలని కోరుతున్న ట్రంప్.. తాజాగా ఓటర్లను ఆకట్టుకునేలా సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్లకు మెజారిటీ కట్టబెడితే అమెరికాలోని వయోజనులకు ఒక్కొక్కరికీ 5 వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన ‘డివిడెండ్’గా పేర్కొన్నారు. అయితే ఈ డబ్బును అమెరికాలోనే ఖర్చు చేయాలన్నది ట్రంప్ పెట్టిన షరతు. కెనడా, చైనా, జర్మనీ వంటి దేశాలకు వెళ్లి ఈ డబ్బును ఖర్చు చేయకూడదని, అమెరికా ఆర్థిక వ్యవస్థలోనే వినియోగించాలని ఆయన సూచించారు.

ట్రంప్ ప్రకటనపై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాలో సుమారు 27 కోట్ల మంది వయోజనులు ఉన్న నేపథ్యంలో.. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు చొప్పున చెల్లించాలంటే ప్రభుత్వంపై దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రధాన ప్రశ్న. అంతేకాదు, ఈ డబ్బును అమెరికాలోనే ఖర్చు చేస్తున్నారా లేదా అన్నది ప్రభుత్వం ఎలా పర్యవేక్షిస్తుందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి భారీ మొత్తాల నిధుల విడుదలకు కాంగ్రెస్ అనుమతి అవసరం. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అనుమతి తీసుకుంటారా? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నదానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు.

చట్టబద్ధతపై చర్చ

ఓటర్లను డబ్బు ఆశ చూపించి ప్రభావితం చేయడం చట్టబద్ధమేనా అన్న అంశంపైనా చర్చ మొదలైంది. కొందరు రాజ్యాంగ నిపుణుల ప్రకారం.. ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసే ప్రయత్నం ఫెడరల్ ఎన్నికల చట్టాల పరిధిలో సమస్యలను సృష్టించవచ్చు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భావప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తాయా అన్న అంశంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ట్రంప్ హామీని ‘డొల్ల హామీ’గా కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకే ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నాయి. అయితే ఇలాంటి హామీలు అమెరికా రాజకీయాల్లో పూర్తిగా కొత్తవి కావు. కరోనా మహమ్మారి సమయంలో జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ నేతలు కూడా తమకు రాష్ట్ర చట్టసభల్లో మెజారిటీ ఇస్తే పౌరులకు ఒక్కొక్కరికి 2 వేల డాలర్ల చొప్పున కొవిడ్ సాయం అందిస్తామని ప్రకటించిన సందర్భాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. ట్రంప్ ప్రకటించిన $5,000 డివిడెండ్ అమలుకు భారీగా నిధులు అవసరం కావడంతోపాటు, కాంగ్రెస్ అనుమతి, చట్టబద్ధత, నిధుల పంపిణీ, అమెరికాలోనే ఖర్చు చేయడాన్ని పర్యవేక్షించడం వంటి అనేక అంశాలు ముందున్నాయి. దీంతో ఎన్నికల వేళ ట్రంప్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగానే కాకుండా ఆర్థిక, న్యాయపరంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు