అంతరిక్ష యుద్ధ రంగంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. కక్ష్యలో స్పేస్ కంట్రోల్ ఆయుధాలు ఉన్నాయని తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్‌లో జరిగిన ఎయిర్, స్పేస్, సైబర్ కాన్ఫరెన్స్‌లో అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
శత్రు దేశాల దురాక్రమణ చర్యల నుంచి అమెరికా సంయుక్త బలగాలను రక్షించేందుకు కక్ష్యలోని ఈ ఆయుధాలు ఉపయోగపడతాయని మెయింక్ తెలిపారు. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు ఎదురయ్యే అంతరిక్ష ముప్పులను ఎదుర్కోవడంలో ఇవి కీలకంగా మారుతాయని స్పష్టం చేశారు.
అయితే ఎలాంటి ఆయుధాలను కక్ష్యలో మోహరించారు? వాటి సామర్థ్యం ఎంత? అనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. ఈ ఆయుధాలు కైనెటిక్, నాన్-కైనెటిక్ విధానాల్లో పనిచేయగలవని మాత్రం మెయింక్ తెలిపారు.

చైనా, రష్యాలపై అమెరికా ఆందోళన
అంతరిక్ష రంగంలో చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా చాలాకాలంగా చెబుతోంది. చైనా తన సైనిక ఆధునికీకరణలో భాగంగా స్పేస్, కౌంటర్-స్పేస్ సామర్థ్యాలపై దృష్టి సారిస్తోందని అమెరికా అంచనా వేస్తోంది. రష్యా కూడా అంతరిక్షాన్ని భవిష్యత్ యుద్ధరంగంగా పరిగణిస్తున్నట్లు అమెరికా పేర్కొంటోంది.
ఉపగ్రహాలు ప్రస్తుతం సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్ వ్యవస్థలకు అత్యంత కీలకంగా మారాయి. దీంతో ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం లేదా వాటి కార్యకలాపాలను అడ్డుకోవడం భవిష్యత్ యుద్ధ వ్యూహాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
ప్రచ్ఛన్న యుద్ధం నుంచే ప్రయత్నాలు
అంతరిక్షాన్ని సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న ఆలోచన కొత్తది కాదు. 1957లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ ఉపగ్రహాల సైనిక వినియోగం, వాటిని ధ్వంసం చేసే సామర్థ్యాలపై దృష్టి సారించాయి. అంతరిక్షంలో అణ్వాయుధాలు, ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపుపై ఆందోళనల నేపథ్యంలో 1967లో ఔటర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం అంతరిక్షంలో సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించడాన్ని నిషేధిస్తుంది.
అయితే ఉపగ్రహాలపై నిఘా, కమ్యూనికేషన్లు, నావిగేషన్ వంటి సైనిక అవసరాల కోసం వివిధ దేశాలు తమ అంతరిక్ష సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కక్ష్యలో ఆయుధాల ఉనికిని బహిరంగంగా అంగీకరించడం అంతరిక్ష భద్రత, భవిష్యత్ యుద్ధ వ్యూహాలపై చర్చకు కొత్త దారితీసే అంశంగా మారింది.




















