హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనవాణి): హైదరాబాద్ బేగంబజార్‌లో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఇక్కడ కొలువుదీరిన స్వర్ణ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 24 క్యారెట్ల బంగారంతో పాటు ఏకంగా 3 లక్షల 83 వేల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన ఈ గణపయ్య విగ్రహం చూపరులను కట్టిపడేస్తోంది.
బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపు వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంగారు కాంతులు, వజ్రాల మెరుపులతో వెలిగిపోతున్న గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా విభిన్న రూపాల్లో గణపయ్య విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. కరెన్సీ నోట్లతో, కూరగాయలతో ఇలా ఎన్నో ప్రత్యేకతలతో విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అదే తరహాలో ఈసారి బేగంబజార్‌లో బంగారం, అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
జ్యువెలరీ షాపు యజమాని ఆధార్ అగర్వాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా తమ షాపులో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈసారి దశావతారాన్ని గుర్తుచేసేలా గణపతి ప్రతిమను రూపొందించినట్లు వెల్లడించారు.
ముంబై లాల్‌బాగ్‌చా రాజా, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి రూపాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ స్వర్ణ గణపతిని రూపొందించినట్లు ఆధార్ అగర్వాల్ తెలిపారు. ఈ విగ్రహం తయారీలో 8 మంది నిపుణులు 8 నెలల పాటు శ్రమించినట్లు చెప్పారు. బంగారు గణపయ్యను, వజ్రాల మెరుపులను చూసేందుకు భక్తులు ఆసక్తిగా బేగంబజార్‌కు తరలివస్తుండటంతో అక్కడ సందడి నెలకొంది.
Loading Tweet...




















