ఢిల్లీ,సెప్టెంబర్ 12 (జనవాణి): చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూఢిల్లీకి వచ్చిన ఆయనకు భారత అధికారులు స్వాగతం పలికారు. దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్ కీలక ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులు, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఇరువురు నేతలు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
గల్వాన్ ఘర్షణతో తీవ్రంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి 2024 నుంచి ఇరు దేశాలు పలు చర్యలు చేపట్టాయి. సరిహద్దుల్లో సైనిక బలగాల ఉపసంహరణతో పాటు వీసా నిబంధనలు, వాణిజ్య సంబంధాలు, ప్రత్యక్ష విమాన సర్వీసుల పునరుద్ధరణ వంటి అంశాల్లోనూ పురోగతి నమోదైంది.
జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో న్యూఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిక్స్ సదస్సు జరిగే భారత్ మండపం పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. బ్రిక్స్ వేదికగా మోదీ-జిన్‌పింగ్ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం భారత్-చైనా సంబంధాలను తదుపరి దశకు తీసుకెళ్తుందా? సరిహద్దు వివాదాల పరిష్కార దిశగా మరింత పురోగతి సాధిస్తారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Loading Tweet...




















