తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

29 జులై, 2026 8:46 PM•ByRamchandram

Share this article

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల ( AI Generated Image)

హైదరాబాద్, జూలై 29: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) బుధవారం పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్‌, డిజాస్టర్ రెస్పాన్స్‌, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్‌, జైళ్ల శాఖల్లోని మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫైర్‌ ఫైటర్‌, వార్డర్‌, డిప్యూటీ జైలర్‌ తదితర పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను త్వరలో ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్లతో పోలీసు ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా పోలీసు శాఖలోనే అత్యధికంగా 5 వేల పోస్టులు భర్తీ చేయనుండగా, మిగతా ఖాళీలను ఎస్‌పీఎఫ్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లో భర్తీ చేయనున్నారు.

పోలీసు శాఖలో అత్యధికంగా 5 వేల పోస్టులు

పోలీసు శాఖలో మొత్తం 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్) 148, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) 14, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ) 12, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) 3, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) 23 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీసు కానిస్టేబుల్ (సివిల్) 3,697, కానిస్టేబుల్ (ఏఆర్) 1,052, కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) 24, డ్రైవర్‌ కానిస్టేబుల్ 20, మెకానిక్‌ కానిస్టేబుల్ 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎస్‌పీఎఫ్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లోనూ అవకాశాలు

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 44, కానిస్టేబుల్‌ 1,380 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫైర్‌, డిజాస్టర్ రెస్పాన్స్‌, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్‌ శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌ 39, ఫైర్ ఫైటర్‌ 751 పోస్టులను భర్తీ చేయనున్నారు. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్‌ శాఖలో డిప్యూటీ జైలర్‌ (పురుషులు) 14, డిప్యూటీ జైలర్‌ (మహిళలు) 1, వార్డర్‌ (పురుషులు) 196, వార్డర్‌ (మహిళలు) 12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

త్వరలోనే దరఖాస్తులు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించింది.

మెడికల్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక సూచనలు

నియామక ప్రక్రియలో తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందుగానే ప్రభుత్వ గుర్తింపు పొందిన సివిల్‌ సర్జన్ వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సూచించింది. నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు లేకపోతే నియామక ప్రక్రియలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి

దరఖాస్తు సమయంలో లేదా నియామక ప్రక్రియలో అవసరమైనప్పుడు సమర్పించేందుకు అభ్యర్థులు కొన్ని కీలక పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని నియామక మండలి సూచించింది. తెలంగాణ స్థానిక ఎస్సీ అభ్యర్థులు తాజా సబ్‌ క్లాసిఫికేషన్‌తో కూడిన కమ్యూనిటీ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 2026 ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన తాజా సర్టిఫికెట్‌, బీసీ అభ్యర్థులు నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌, స్థానిక అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బోనాఫైడ్‌ లేదా రెసిడెన్స్‌ సర్టిఫికెట్లు, అవసరమైతే ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు